నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే..!

దేశవ్యాప్తంగా జమ్మూ – కశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. తీవ్ర ఉత్కంఠ సృష్టించిన జమ్మూ – కశ్మీర్ లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో చాలా పోటా పోటీగా జరిగాయి. ఇందులో 90 అసెంబ్లీ స్థానాలకు గాను నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి 48 చోట్ల నెగ్గింది.

 

ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. అయితే, బీజేపీ సొంతంగా 29 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. ఇక, పీడీపీ 3, జేపీసీ 1, సీపీఐ (ఎం) 1, ఆప్ 1, ఇతరులు 7 స్థానాలు దక్కించుకున్నారు. బుద్గామ్ లో గెలిచిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మంగళవారం మాట్లాడారు.

 

కొత్త సంస్థలను సృష్టించి తమ పార్టీని నాశనం చేయడానికి గత ఐదేళ్లుగా పెక్కు ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆ సంస్థలు ఈ ఎన్నికల్లో మట్టి కరిచాయని ఒమర్ అబ్దుల్లా అన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన సమీప పిడిపి ప్రత్యర్థులను ఓడించి గందర్బల్, బుద్గామ్ సీట్లను గెలుచుకున్నారు. ఆయన గందర్బల్‌లో 10 వేలకు పైగా ఓట్లతో గెలుపొందగా.. బుద్గామ్‌లో 18 వేల ఓట్లతో భారీ విజయం సాధించారు.

 

ఐదేళ్లల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌ను నాశనం చేసేందుకు అనేక పార్టీలను సృష్టించారని ఆరోపించారు. ఆ పార్టీల లక్షం ఒక్కటే నేషనల్ కాన్ఫరెన్స్‌ను నాశనమేనని అన్నారు. కానీ, దేవుడి దయతో మమ్మల్ని నాశనం చేయాలనుకునే వారంతా మట్టిలో కలిసిపోయారని అని చెప్పారు. ఓటు వేసి అండగా నిలిచిన జమ్మూ కశ్మీర్ ప్రజలకు మరోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బుద్గామ్ ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు.

 

ఇదిలా ఉండగా, జమ్మూ కశ్మీర్‌కు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతారని తెలిపారు.

 

సరిగ్గా పదేళ్ల తర్వాత జమ్మూ ప్రజలకు తమ స్పష్టమైన నిర్ణయాన్ని ఇచ్చారని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పారు. ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *