తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంగళవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నాలుగవ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌లు హాజరయ్యారు. అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా మేరకు వీలున్నంత త్వరగా కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాష్ట్ర ప్రభుత్వ యస్.సి అభివృద్ధి శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, ఐ.ఏ.యస్ అధికారులు బుర్రా వెంకటేశం,లోకేష్ కుమార్, దానకిశోర్, టి.కే.శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
రూట్ మ్యాప్ రెడీ…
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు,పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందని, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అనంతరం వెల్లడించారు. అందుకు సంబంధించి విద్య, ఉద్యోగాల గణాంకాల సమాచారాన్ని నివేదిక రూపంలో అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని నిర్దిష్టమైన టైంబౌండ్ పెట్టుకుని పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఏకసభ్య కమిషన్…
కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను ముందుగానే పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు సూచించింది. ఇద్దరు లేదా ముగ్గురు సభ్యుల కమిషన్ కంటే ఏకసభ్య కమిషన్ అయితేనే, నిర్ణయాలు తీసుకోవటం సులభంగా ఉంటుందని, చట్టపరంగా, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూడటం సులభమని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
నేడు రాష్ట్రవ్యాప్త నిరసన
హైదరాబాద్, స్వేచ్ఛ: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకత్వంలో నేడు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్గీకరణ లేకుండానే నేడు 11 వేల ప్రభుత్వ టీచర్లకు నియామక పత్రాలు అందించటం దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం తీరును నిరసిస్తూ నేడు హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయాలని.. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు కొమ్ము కాస్తూ మాదిగల గొంతు కోస్తోందని, తక్షణం ఎస్సీ వర్గీకరణ జరిపి, ఆ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్సీల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.