మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం.

హైదరాబాద్‌లోని మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయి. దీంతో మెట్రో రెండో దశకు త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రెండోదశలో 5 కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగానే ఫోర్త్‌ సిటీ మినహా మిగిలిన 5 కారిడార్లకు 76.2 కి.మీ.కు రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్‌లో అధికారులు పేర్కొన్నారు.

 

అయితే దసరా నాటికి డీపీఆర్‌లు సమర్పించాలని ప్రభుత్వం తొలుత నిర్దేశించింది. ఈ నెల 7న ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సీఎం రేవంత్రెడ్డి భేటీ ఖరారు కావడంతో ఆ పర్యటనకు ముందుగానే డీపీఆర్‌లు కావాలని సీఎం కార్యాలయం కోరింది. దీంతో 7వ తేదీ నాటికి డీపీఆర్‌లను ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు సంస్థ అధికారులు తెలిపారు.

 

రెండోదశ మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం వాటా సాధారణంగా 15 శాతం వరకే భరిస్తుంది. కానీ హైదరాబాద్‌ మెట్రో రెండోదశలో 18 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు. ఇక, ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతంతో కలిపి మొత్తం 48 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు.

 

అలాగే 4 శాతం పీపీపీ పెట్టుబడులకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నారు. ఇక, మిగిలిన 48 శాతానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులను సమీకరించుకొనే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి జైకా వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోనుంది. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య ప్రాజెక్టుపై రుణాలకు కేంద్రం పూచీకత్తు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *