రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించి సహాయం చేయాలని కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ – 2047 పై ప్రధాని మోదీకి వివరించాను. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కూడా ప్రధానికి వివరించా. పోలవరం ప్రాజెక్టు పనులపై కూడా కేంద్రంతో చర్చించా. గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాళా తీసింది. ఏపీలో చెత్త నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో రాష్ట్రంలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఐదేళ్లుగా కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం వినియోగించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ఈ సందర్భంగా గుర్తు చేశాను. హౌరా- చెన్నై రైల్వే లైన్ పై చర్చించాం’ అని చంద్రబాబు తెలిపారు.