హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ విజయం.. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఆయనే..!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయం అందుకున్న బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 90 సీట్లకు గానూ 48 సీట్లు సాధించిన బీజేపీ.. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. అయితే ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నప్పటికీ ఇప్పటికే కాషాయదళం ఛాయిస్ క్లియర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

 

హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో మరో మాటకు తావు లేదని బీజేపీ అధిష్టానం పెద్దలు చెబుతున్నట్లు సమాచారం. ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయన్ను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు మెసేజ్ పంపేందుకు ప్రయత్నిస్తోంది.

 

ఎన్నికలకు సరిగ్గా 200 రోజుల ముందు నాయబ్ సింగ్ సైనీని మనోహర్ లాల్ ఖట్టర్ స్ధానంలో అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. దీనిపై అప్పట్లో పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. ఖట్టర్ వర్గం కూడా సైనీని అప్పట్లో ఆమోదించలేదు. కానీ క్రమంగా అధిష్టానం మనసులో ఏముందో తెలుసుకున్న పార్టీ నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆ అస్త్రమే పనిచేసింది. దీంతో త్వరలో శాసనసభాపక్ష భేటీ ఏర్పాటు చేసి సైనీకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *