ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఏపీకి వరదసాయం కూడా ప్రకటించింది. అయితే ఏపీ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో వరద నష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. అయితే తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. కేంద్రంను కోరిన అతి పెద్ద కోరిక తీరింది. అదే పోలవరం ప్రాజెక్ట్ కి నిధుల సాధన.
ఏపీ ఎన్నికల సమయంలో కూటమిగా టీడీపీ, జనసేన, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో గల బీజేపీలు ఏర్పడి చివరికి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా 164 సీట్లు సాధించాయి. అలాగే 21ఎంపీ సీట్లు సైతం కూటమి గెలుచుకోగా అందులో 16 సీట్లు టీడీపీ, జనసేన 2, బీజేపీ 3సీట్లలో విజయాన్ని అందుకున్నాయి.
దీనితో కూటమిలో అతి పెద్ద పార్టీగా ఏపీలో టీడీపీ అని చెప్పవచ్చు. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఏపీ కూటమి బలం కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఏపీ అభివృద్ది, కేంద్రం సహకారంపై ఆశలు చిగురించాయి. అంతలోనే వరదలు రాగా.. కేంద్రం మిలటరీ దళాలను పంపించడమే కాక, వేల కోట్ల నిధులను మంజూరు చేసి ఏపీకి భరోసాను అందించింది.
అంతవరకు ఓకే గానీ ఏపీ అభివృద్దికి కావాల్సిన నిధులు రాబట్టడమే ఏపీ ప్రభుత్వం ముందున్న అసలు సవాల్. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలోకి వెళితే.. ఎన్నో ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం ఏపీ ప్రజల కల. కానీ ఆ కల.. కలగానే మిగిలిపోతుందా అనే ప్రశ్నలు మొన్నటి వరకు ఏపీ ప్రజల మదిలో మెదిలేవి.
కానీ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండడం, అలాగే కూటమిలో భాగమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా.. పోలవరం ప్రాజెక్ట్ పై ఆశలు చిగురించాయి. భాద్యతలు చేపట్టిన అనంతరం బాబు పోలవరాన్ని సందర్శించి, గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరంను నాశనం చేశారని, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఎలా ముందుకు సాగాలో అర్థం కావడం లేదని తెలిపారు.
నిన్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పోలవరం ప్రాజెక్ట్ కి నిధుల విడుదలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిందా.. రైతాంగం ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే సీఎం బాబు తొలి ప్రాధాన్యతగా పిఎం మోడీతో ఇదే విషయాన్ని చర్చించారు. ప్రస్తుత పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులు వివరించిన చంద్రబాబు.. నిధులు విడుదల చేయాలని కోరారు.
అలా బాబు కోరారో లేదో వెంటనే కేంద్రం సైతం పోలవరం నిర్మాణానికి రూ.2,800 కోట్లు మంజూరు చేస్తూ, అడ్వాన్స్‌గా రూ.2000 కోట్లు ఇచ్చింది. కాగా రూ.30, 436 కోట్ల డీపీఆర్‌కు ఇదివరకే ఆమోదం తెలిపిన కేంద్రం.. భారీగా నిధులు మంజూరు చేయగా.. ఇది కదా బాబు సత్తా అంటూ ప్రజలు… కూటమి ప్రభుత్వానికి, కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో ముందు ఉందని టీడీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది.