ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కూటమి నేతలు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన..రెండు టీడీపీకి దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో రాజ్యసభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసారు. దాంతో రాజ్యసభలో 11 మంది సభ్యులున్న వైసీపీ బలం ప్రస్తుతం 8కి తగ్గిపోయింది. మరో ఎంపీ సైతం త్వరలో రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. అటు రాజ్యసభలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలకి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇటు శాసన మండలిలో కూటమి సభ్యుల సంఖ్యా బలం తక్కవగా ఉంది. దాంతో కూటమి నేతలుఈ రెండు సభల్లోని వైసీపీ సభ్యులపై ఫోకస్ పెడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు మగ్గురూ బీసీ వర్గానికి చెందిన వారే. ఆ ముగ్గురిలో బీద మస్తానరావు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పడో రిటైర్‌మెంట్ ప్రకటించారు. మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైందంటున్నారు. ఆర్.కృష్ణయ్య తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకునే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రెండు, జనసేనకు ఒక స్థానం ఖాయమయ్యాయనే ప్రచారంతో…. టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో ఒకటి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో కనిపిస్తున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు సైతం పరిశీలనలో ఉందంటున్నారు మరికొందరు రాజకీయ పెద్దలు. నాలుగో స్థానం కూడా భర్తీ చేయాల్సి వస్తే ఎస్సీ వర్గానికి ఇస్తారని చెప్తున్నారు
ఇక జనసేనకు దక్కే రాజ్యసభ స్థానంలో రేసులో మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కటంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆయన పేరు రాజ్యసభ రేసులో ఫోకస్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో సార్లు పార్టీ కోసం తనకు రావల్సిన పదవులు నాగేంద్రబాబు వదులు కోవటంతో ఈ సారైనా ఆయనకి తగిన పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ రాజకీయ పరిణామాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.