ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ట్వీట్ల వర్షాన్ని ఇంకా కురిపిస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డు వివాదం సమయం నుండి పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు రోజా. అయితే ఈ సారి రోజా కొంత శృతిమించి విమర్శించినట్లుగా భావించవచ్చు. ఇంతకు మాజీ మంత్రి రోజా ట్వీట్ ఏమి చేశారంటే…
పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ అంటూ సంబోధిస్తూ దేవుడు పుట్టుకతో బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించాలంటూ ట్వీట్ చేయడం పొలిటికల్ సంచలనంగా మారింది. అంతటితో ఆగక మీరు పంచే ఎగ్గాట్టాల్సింది.. గుడిమెట్లపై కాదని, విజయవాడ వరద భాడితుల కోసమని తెలుపుతూ.. వరద బాధితులకు ఇంకా సాయం అందలేదంటూ ఎద్దేవా చేశారు.
ధర్మం అని అరిచే పవన్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ధర్మం చేయాలంటూ అరవాలని కోరారు. ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్.. గుడి మెట్లను శుభ్రం చేయగా.. ఆ విషయానికి సంబంధించి ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని కడిగేయండి అంటూ రోజా ట్వీట్ చేశారు.
అంతటితో ఆగక.. మీరు దీక్ష చేపట్టారు ప్రసాదాల కోసం.. కానీ రాష్ట్రంలో రాలిపోతున్న ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసమంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏ లోటు లేని సనాతనం కోసం మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సిన అవసరం లేదని, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం డిక్లరేషన్ ప్రకటించాలని రోజా సూచించారు.
మీరు ఆపసోపాలు పడాల్సింది.. కొండెక్కడం కోసం కాదని.. రాష్ట్రం లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు అరికట్టడం కోసమని, మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు… మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన అంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
ఇలా రోజా.. పవన్ పై విమర్శలను కవిత రూపంలో తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై జనసేన లీడర్స్, వీరమహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోజా ట్వీట్ పై పవన్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.