కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణలో తాము చేస్తున్న పనులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు అరగంట పాటు భేటీ అయిన సీఎం, వివిధ అంశాలపై చర్చించారు.
రెండురోజుల కిందట ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy).. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలుస్తున్నారు. రీసెంట్‌గా తెలంగాణలో వచ్చిన వరదల వల్ల మూడు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల పునరుద్ధరణకు సంబంధించి పనులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వివరించారు.
వరదల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షకు పైగా పశువులు మృతి చెందాయి. 4.15 లక్షల ఎకరాల్లో పంటతోపాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్న విషయాన్ని వివరించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. గత నెల 30న కేంద్రానికి నివేదిక సమర్పించిన విషయం తెల్సిందే.
తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం నేపథ్యంలో ఐపీఎస్‌ల కేటాయింపు పెంచాలని కోరారు ముఖ్యమంత్రి. తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని కోరారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
దీనికితోడు పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. షెడ్యూల్-9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్-10లో సంస్థల వివాదం సామరస్య పూర్వక పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున, వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు.