ఏపీలో గత ప్రభుత్వ హయాంలో, తీవ్ర వేధింపులకు గురైన ముంబయి నటి కాదంబరి జెత్వానీ… రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఊపిరి పీల్చుకుంది. ఆమె ఫిర్యాదుతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. తప్పుడు కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నటి జెత్వానీ తాజాగా విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవ స్ఫూర్తి వెల్లివిరుస్తోందని తెలిపారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించానని వెల్లడించారు.
ఎంతగానో సహకరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జెత్వానీ స్పష్టం చేశారు.
కాగా, ఇటీవలి వరకు ఎంతో భయాందోళనలతో, ముఖానికి మాస్కుతో కనిపించిన కాదంబరి జెత్వానీ… ఇవాళ మాత్రం మాస్కు తీసేసి, ఎంతో ఆత్మవిశ్వాసంతో, నిబ్బరంగా కనిపించారు. మీడియాతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు.