2026 నాటికి నక్సలిజం లేకుండా చేస్తాం.. నెలన్నర కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్‌పూర్‌లో చెప్పిన మాట. దాని ప్రకారం బలగాలు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. షా అన్నట్లుగా ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాది మొదలై ఇప్పటివరకు 186 మంది మావోలు మరణించారంటే పరిస్థితి ఏం రేంజ్‌లో అర్థం చేసుకోవచ్చు.
శుక్రవారం ఉదయం 10 గంటల దండకారణ్య ప్రాంతంలో తుపాకుల శబ్దాల మోత మొదలైంది. దాదాపు ఆరేడు గంటల అంటే సాయంత్రం ఆరు గంటల వరకు కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మావోయిస్టుల అగ్రనేతలు సీక్రెట్‌గా సమావేశం అయ్యారని ఇన్‌పుట్స్ వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన బలగాలు నారాయణపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు అబూజ్‌మడ్ అడవులను చుట్టిముట్టాయి.
రెండు జిల్లాలకు చెందిన రిజర్వుగార్డ్స్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ బలగాలు చెందిన దాదాపు 1200 మంది బలగాలు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. అబూజ్‌మడ్ అడవులను చుట్టూ రౌండప్ చేశారు. కూంబింగ్ చేస్తూ మెల్లగా అడుగులు వేస్తున్న సమయంలో తుపాకుల శబ్దం మొదలైంది.
అక్కడి నుంచి బలగాలకు-మావోలకు మధ్య కాల్పులు భీకరంగా సాగాయి. మధ్యాహ్నం మూడు గంటలకు మావోల నుంచి కాల్పుల శబ్దం తగ్గడంతో గాలింపు చేపట్టారు. తొలుత 10, 15, 20, 25, 30, చివరకు 36 మంది మావోయిస్టులు మరణించినట్టు తేలింది.
బలగాల్లో కొందరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మొదలై ఇప్పటివరకు జరిగిన 12 ఎన్‌కౌంటర్లలో దాదాపుగా 186 మంది మరణించారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టు పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. సెప్టెంబరు మూడో వారం నుంచి అక్టోబరు 20 వరకు జరగనున్నాయి.
అడవుల్లో సభలు, సమావేశాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. అయితే మృతుల్లో గ్రామస్తులున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన తర్వాత రాష్ట్రానికి చెందిన టాప్ సీనియర్ పోలీసులు అధికారులతో సీఎం విష్ణుదేవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బలగాలకు అభినందనలు తెలిపారు.
ఈ లెక్కన మావోలు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని అక్కడి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు కేరాఫ్ అడ్రాస్ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతం. దీన్ని సొంత ఇల్లుగా భావిస్తున్నారు. కమెండోలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే హడలిపోయేయి బలగాలు. టెక్నాలజీ పుణ్యమాని ఆ ప్రాంతంపై నిఘా పెంచాయి బలగాలు. దీంతో మావోలకు కోలుకోని దెబ్బలు తగులుతున్నాయి.