కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందన.. ఏమన్నారంటే..?

టాలీవుడ్ సినీ నటులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనేగాక, దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు నాగార్జున, సమంత, నాగచైతన్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్యల విడాకులకు కేటీఆరే కారణమని, కేటీఆర్ కారణంగా కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని కొండా సురేఖ ఆరోపించారు.

 

ఈ సందర్భంగా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Pree Singh) పేరును కూడా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును ఎందుకు వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

 

‘సృజనాత్మత, వృత్తి నైపుణ్యానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన తెలుగు ఇండస్ట్రీలో తనది గొప్ప ప్రయాణం. ఇప్పటికీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. ఒక మహిళ గురించి దారుణమైన, దుర్మార్గమైన నిరాధార ఆరోపణలు చేయడం విని బాధగా అనిపించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలా వ్యాఖ్యానించడం మరింత బాధించింది’ అని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

అంతేగాక, హుందాగా వ్యవహించాలనే ఉద్దేశంతోనే తామంతా నిశ్వబ్ధంగా ఉన్నామని.. కానీ, అదే తమ బలహీనత అనుకోవద్దని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. నేను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తిని. నాకు ఏ వ్యక్తి/రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరును ఉపయోగించవద్దని కోరుతున్నా. నటులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను రాజకీయాలకు దూరంగా పెట్టండి. వార్తల్లో నిలిచేందుకు వారి పేర్లను వాడుకుని కల్పిత కథనాలను సృష్టించవద్దని రకుల్ ప్రీత్ సింగ్ హితవు పలికారు.

 

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ పెద్దలు, నటులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ నటులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని, నిరాధార ఆరోపణలు చేసి కించరిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు, కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *