కౌంట్ డౌన్ షురూ – ఇక సమరమే..!!

హర్యానాలో పోలింగ్ కు కౌండ్ డౌన్ మొదలైంది. హోరా హోరీగా సాగిన ప్రచారం ముగిసింది. తిరిగి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ చివరి ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా అధికారం దక్కాలనే లక్ష్యం తో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు పోలింగ్ వేళ కీలకంగా మారుతున్నాయి. తాము ఇచ్చిన హామీలు ఓట్లుగా మారుతాయనే నమ్మకంతో పార్టీలు ఉన్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

 

అసలైన సమరం

హర్యానాలో ఎన్నికల ప్రచారం పూర్తయింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు తమ సత్తా చాటుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసాయి. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. హర్యానాలో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని ఎన్నికల రంగంలోకి దిగింది. రెండు ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికారం పీఠం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

 

రేసులో ప్రధాన నేతలు

ఈ రెండు ప్రధాన పార్టీలో పాటుగా జేజేపీ, ఏస్పీ, బీఎస్పీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా, ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అటు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 20,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఈ ఎన్నికల్లో 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 101 మంది మహిళలు ఉన్నారు. బరిలో సీఎం నాయిబ్ సింగ్ సైనీ (లద్వా), భూపేంద్ర సింగ్ హుడా (గర్హి సంప్లా-కిలోయ్), అభయ్ సింగ్ చౌతాలా (ఎల్నాబాద్), దుష్యంత్ చౌతాలా (ఉచన), అనిల్ విజ్ (అంబలా క్యాట్), ఓపీ ధంఖర్ (బద్లా), అనురాగ్ ధండా ( కలయత్), వినేష్ ఫోగట్ (జులానా) వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు.

 

హోరా హోరీ

2019 ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి 31 సీట్లు సాధించింది. ఈ సారి కాంగ్రెస్ గెలుపు పైన ధీమాతో ఉంది. అయితే, కాంగ్రెస్ పైన బీజేపీ పలు కీలక అంశాలను అస్త్రాలుగా మలచుకుంది. రిజర్వేషన్లు, అవినీతి, బుజ్జగింపు, బంధుప్రీతిపై కాంగ్రెస్‌పై దాడి చేసింది. కాంగ్రెస్ తాము ప్రకటించిన ఏడు గ్యారెంటీలు ఓట్లను తెచ్చి పెడతాయని అంచనా వేస్తోంది. బీజేపీ సైతం ప్రధాన హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాలో ప్రచారం చేశారు. బీజేపీ తనను జైలుకు పంపి తన పనిని ఆపిందని ఆరోపించారు. హర్యానాలో తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదంటూ కేజ్రీవాల్ ఆశతో ఉన్నారు. దీంతో, హర్యానా సమరం పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *