కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు.. ఫార్మా సిటీ పేరుతో కుట్ర..

ముఖ్యమంత్రి రేవంత్ హయాంలో తెలంగాణలో పాలన అస్తవ్యస్తమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. గురువారం జహీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని న్యాల్కల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పొల్గొన్నారు. ఫార్మాసిటీ వల్ల పొలాలు కోల్పోతున్న రైతులను పలకరించి, అక్కడి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

ఫార్మా సిటీ పేరుతో కుట్ర

హైదరాబాద్ సమీపంలో ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 15 వేల ఎకరాలు సేకరించిందని, ఆ ఫార్మాసిటీకి పర్యావరణ, అటవీ అనుమతులూ వచ్చాయని, కానీ, ముఖ్యమంత్రి మాత్రం ఆ భూమిని కాదని, న్యాల్కల్‌లోని పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పెట్టాలంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఒకవేళ సీఎం హైదరాబాద్ వద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుంటే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని సూచించారు. నిజానికి మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి మిగతా రియల్ ఎస్టేట్ చేయాల‌నే ప్లాన్‌లో రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకే ఆయన చూపు ఇక్కడి పచ్చని పంటపొలాల మీద పడిందని హ‌రీశ్‌రావు తెలిపారు. ఇంతకూ హైదారాబాద్‌లో ఫార్మా సిటీ ఉన్నట్లా లేనట్లా అనేది సీఎం వెంటనే ప్రకటన చేయాలన్నారు.

 

రైతు వ్యతిరేక సీఎం..

మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇస్తే, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కిసాన్ హఠావో అంటున్నారని, ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో అసైన్డ్ భూములను పట్టా భూములు చేస్తానని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముందు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇకనైనా రాహుల్ గాంధీ దీనిపై సీఎంకు మొట్టికాయలు వేసి హామీలు అమలు చేయించాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ వచ్చినా రైతుబంధు రాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ రుణమాఫీ పేరుతో దేవుళ్లనూ రేవంత్ మోసం చేశారని ఫైర్ అయ్యారు.

 

ఎదురు నిలుస్తా..

మూసీ నదిని మంచినీటి నదిగా మార్చుతానని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జహీరాబాద్‌లో ఫార్మా సిటీ పెట్టి మంజీరా నదిని కలుషితం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. ఫార్మా సిటీ నుంచి వచ్చే వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నక్కవాగు, చాకలి వాగు, కోట వాగు, న్యాల్‌కల్ వాగుల్లో కలుస్తాయని తెలిపారు. అక్కడి నుంచి ఆ నీరంతా వెళ్లి చెనగపల్లి ప్రాజెక్టులోకి వెళ్తాయని, అక్కడి నుంచి పెద్ద వాగు ద్వారా మంజీరాలో పడతాయని పేర్కొన్నారు. దీంతో పాలలాంటి మంజీరా కాలుష్య కాసారంగా మారుతుందని, మెదక్, హైదరాబాద్ వాసులు తాగే నీరు కలుషితమవుతుందని హరీశ్ ఆవేదన వక్తం చేశారు. ఇక్కడ భూసేకరణను అడ్డుకుంటామని, తానే వచ్చి బుల్డోజర్‌లకు ఎదురు నిలబడతానని అన్నారు. పోరంబోకు, రాళ్లురప్పల భూముల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని, పచ్చని పంటపొలాల్లో కాదని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. న్యాల్‌కల్ ఫార్మాసిటీ భూ సేకరణను వెంటనే రద్దు చేయాలని, అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తామని హెచ్చరించారు. రైతుల జోలికి వస్తే రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *