మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ.. ఈసారి ఏమన్నారంటే..?

మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తమపై ఇష్టానుసారంగా, అవమానకరంగా పిచ్చి రాతలు రాయిస్తున్నారంటూ కేటీఆర్ పై ఆమె మండిపడ్డారు.

 

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరేనని కొండా సురేఖ అన్నారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, పదవీ ఆకాంక్షతోనే కేసీఆర్ ను కేటీఆరే ఏదో చేశారనే ప్రచారం జోరుగా సాగుతుందంటూ ఆమె పేర్కొన్నారు. అతనే సీఎం అనుకుని కేటీఆర్ పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారంటూ మంత్రి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ కొండా సురేఖ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారని, అందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

 

ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై ఇష్టానుసారంగా, అవమానకరంగా పోస్టులు పెట్టారంటూ కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఇదంతా కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేటీఆర్.. మీ సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టులను మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించు.. వారు ఏ విధంగా స్పందిస్తారో అప్పుడు చెప్పు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా స్పందించారు. కొండా సురేఖవి దొంగ ఏడుపులు.. పెడబొబ్బలన్నారు. కొండా సురేఖ తమపై వ్యాఖ్యలు చేసేముందు గతంలో ఆమె మాట్లాడిన బూతు మాటలను గుర్తుచేసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందిస్తూ కేటీఆర్ వన్నీ అబద్ధాలేనంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరేనంటూ ఆమె ఆరోపించారు. అదేవిధంగా పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రముఖులు నాగార్జున, అమల, సమంత, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, డైరెక్టర్ రాంగోపాల్ వర్మతోపాటు పలువురు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయంలోకి సినిమా వాళ్లను లాగొద్దంటూ సూచించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. సమంత విషయమై చేసిన వ్యాఖ్యలను తాను విరమించుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాను సినిమా వాళ్లపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయలేదని, కేటీఆర్ పై మాత్రమే చేశానన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే మన్నించాలన్నారు. కానీ, కేటీఆర్ పై తన పోరాటం ఆగబోదన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నవారిని శిక్షించేవరకు తాను ఊరుకోబోనన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *