మౌనంగా ఉన్నాను, అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందన..

తాజాగా కేటీఆర్‌ను విమర్శించడం కోసం కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ.. అక్కినేని ఫ్యామిలీని అడ్డం పెట్టుకున్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని, ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్.. నాగార్జునను అడిగారని.. ఇలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి ముందుకొచ్చింది. ఇప్పటివరకు సమంత, నాగార్జున, అమల దీనిపై స్పందించారు, ఖండించారు. ఇప్పుడు నాగచైతన్య కూడా ఈ విషయంపై ట్వీట్ చేశాడు.

 

ప్రశాంతమైన నిర్ణయం

 

‘ఒకరి జీవితంలో తీసుకునే అతి కష్టమైన, దురదృష్టకరమైన నిర్ణయాల్లో విడాకులు కూడా ఒకటి. ఎంతో ఆలోచించిన తర్వాత నేను, నా మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇద్దరి నిర్ణయం. మా జీవిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ఒకరి మీద మరొకరికి అదే గౌరవంతో జీవితంలో ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో మేము ప్రశాంతంగానే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకు మా విడాకుల విషయంపై ఎన్నో అసత్యపు ప్రచారాలు, ఆధారాలు లేని గాసిప్స్ వచ్చాయి’ అంటూ సమంతతో తన విడాకుల నిర్ణయం గురించి మరోసారి గుర్తుచేసుకున్నాడు నాగచైతన్య. ఆపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ప్రస్తావించాడు.

 

అడ్వాంటేజ్ తీసుకోవద్దు

 

‘నా కుటుంబంపై, నా మాజీ భార్యపై ఉన్న గౌరవంతో ఎన్ని అసత్యపు ప్రచారాలు మా విడాకులపై వచ్చినా కూడా నేను మౌనంగానే ఉండడానికి ఇష్టపడ్డాను. కానీ ఈరోజు మంత్రి కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు దారుణం. వాటిని నేను అస్సలు ఒప్పుకోను. ప్రతీ మహిళ.. మరొక మహిళను సపోర్ట్ చేయాలి, గౌరవించాలి. సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన నిర్ణయాలను అడ్వాంటేజ్‌గా తీసుకొని మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారడం కోసం ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు’ అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించాడు నాగచైతన్య. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మొత్తం దీనిని ఖండించింది.

 

ఫ్యాన్స్ ఆగ్రహం

 

అక్కినేని ఫ్యామిలీ అనేది ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో గుర్తింపు సాధించింది. గర్వకారణంగా నిలిచింది. అలాంటి కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు రావడం సినీ సెలబ్రిటీలకు నచ్చలేదు. అందుకే ఈ ఆరోపణలను ఖండించడానికి వారంతా ఒక్కటయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాగార్జున, నాగచైతన్యతో పాటు వారి ఫ్యాన్స్ కూడా వీటిపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అంతే కాకుండా కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా వారు కోరారు. మొత్తానికి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ సినీ సెలబ్రిటీలకు కోపం తెప్పించారు. ముఖ్యంగా బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఫ్యాన్స్ అంతా ఆమెను వదిలేలా కనిపించడం లేదు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *