ఇంకో రెండ్రోజుల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు పండగ శోభను సంతరించుకుంటోన్నాయి. అమ్మవారి ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 3వ తేదీన దసరా పండగ మొదలు కాబోతోంది. 12వ తేదీన విజయదశమితో నవరాత్రులు ముగుస్తాయి.
ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేను బ్యాన్ చేశారు. దీనికొక్కదానికే పరిమితం కాలేదు. డీజే సౌండ్ సిస్టమ్, సౌండ్ మిక్సర్స్, సౌండ్ యాంప్లిఫయర్స్, అధిక శబ్దాన్ని వెలువడించే అన్ని రకాల ఎక్విప్‌మెంట్‌పైనా ఈ నిషేధం వర్తిస్తుంది. అదే సమయంలో హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడాన్నీ నిషేధించారు పోలీసులు.
ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఉత్సవాల సమయంలో శబ్ద కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సౌండ్ డెసిబల్స్ ప్రమాణాలను సైతం పరిమితంగా ఉండాలని ఆదేశించారు.
దీన్ని ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్ నగర పోలీస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, హైదరాబాద్ నగర లౌడ్ స్పీకర్ల నిబంధనల కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
డీజే సౌండ్ బాక్సులు, ఇతర భారీ శబ్ద పరికరాలను అద్దెకు తీసుకోవాలన్నా, సౌండ్ సిస్టమ్స్ ఎక్విప్‌మెంట్‌ను డీలర్లు లేదా కంపెనీలు సరఫరా చేయాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. తెల్లవారు జామున 6 నుంచి రాత్రి 10, రాత్రి 10 నుంచి మళ్లీ తెల్లవారు జామున 6 గంటల వరకు రౌండ్ ద క్లాక్ తరహాలో డీజే సౌండ్ బాక్సుల వినియోగం, లౌడ్ స్పీకర్లు, బాణాసంచా కాల్చడంపై నిషేధం అమలులో ఉంటుంది.
ఆసుపత్రులు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, న్యాయస్థానాల వద్ద వంద మీటర్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని సైలెంట్ జోన్‌గా పరిగణించారు. ఏడాది పొడవునా హైదరాబాద్‌లో పండగలు, ఉత్సవాలు, వివిధ మతపరమైన వేడుకలు కొనసాగుతుంటాయని, అలాంటి సమయంలో అధిక సౌండ్‌ను వెలువడించే పరికరాలను వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని, దీన్ని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని సీవీ ఆనంద అన్నారు.