దసరా లోపే క్యాబినెట్ విస్తరణ… వీళ్లకు మంత్రులుగా ఛాన్స్..!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్‌ పెద్దలను కలవనున్నారు. మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం ముగిసింది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అనుకోకుండా అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతున్న ఖర్గేను పరామర్శించేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. హర్యానా, కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో హైకమాండ్ నేతలు బిజీగా ఉన్నందున ఈ పర్యటనలో వారితో సీఎం సమావేశమయ్యే అవకాశం లేదని పేర్కొన్నాయి.

 

కేసీ వేణుగోపాల్‌తో భేటీ..

 

మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో బాటు క్యాబినెట్ విస్తరణ, పెండింగ్ నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ప్రణాళికల వంటి అంశాలనూ ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నూతన టీపీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత జిల్లాల వారీగా చేపట్టిన సమీక్షలు, రాష్ట్రంలోని వర్తమాన రాజకీయ పరిస్థితులు, పొంగులేటి మీద జరిగిన ఈడీ దాడుల గురించి సీఎం కేసీ వేణుగోపాల్‌కు వివరించినట్లు సమాచారం.

 

దసరాలోపు మంత్రివర్గ విస్తరణ

 

మరోవైపు..తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే అధిష్ఠానం క్లారిటీ ఇచ్చిందనీ, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబరు 8న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు రానున్నందున, అక్టోబరు 12 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులపైనా ఈ పర్యటనలో క్లారిటీ రానుందని, అక్టోబరు 8 తర్వాత మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పెండింగ్ అంశాలకు ఆమోదముద్ర వేయించుకుని రానున్నారని టీపీసీసీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *