బతుకమ్మ షెడ్యూల్ విడుదల.. 10న ట్యాంక్ బండ్‌పై సంబురాలు..

బతుకునిచ్చే తల్లి బతుకమ్మ. రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి, ఆ పైన గౌరమ్మను ఉంచి, ప్రకృతినే దేవతగా కొలిచే వేడుక. 9 రోజులపాటు తెలంగాణ అంతటా ఒక జాతరలా మారుతుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ, చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతీ ఇంటా సంబురాలను మోసుకొస్తుంది. ఇవాళ్టి నుంచి బతుకమ్మ వేడుకలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

 

రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాలు

 

బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో 9వ తేదీ వరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. 10వ తేదీన ట్యాంక్ బండ్‌పై వేడుకలు, లేజర్ షో ఉంటుంది. ఈసారి అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వరకు వెయ్యి బతుకమ్మలతో భారీ ర్యాలీ తీయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కూడా హాజరుకానున్నారు.

 

సీఎం శుభాకాంక్షలు

 

తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అని చెప్పారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని‌ గౌరమ్మను ప్రార్థించారు రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *