తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకరేమో శాంతి పూజలు.. మరొకరు ప్రాయశ్చిత్త దీక్ష.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలని అంటున్నారని చెప్పారు. దయ చేసి ఈ వ్యవహారాన్ని రాజకీయ చేయవద్దని, మత రంగు పులమడం అంతకంటే కరెక్ట్ కాదన్నారు. ఇంతకీ షర్మిల వ్యాఖ్యల వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.
తిరుమల లడ్డూ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని అందరి కంటే ముందు ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు వైఎస్ షర్మిల. లడ్డూ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి, అటు కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ లేఖ రాసిందని గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. సిట్ కంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరగాలన్న రీతిలో ఉన్నట్లు అర్థమవుతోంది షర్మిల. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ కు షర్మిల విజ్ఞప్తి చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం విశాఖలో మెడిసన్ దీక్ష చేపట్టారు వైఎస్ షర్మిల. అంతకుముందు విజయవాడ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు.
నార్మల్‌గా ఏపీలో ఏ విషయం బయటకు వచ్చినా తొలుత కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రియాక్ట్ అవుతున్నారు. వర్షాలు, బెజవాడ వరదలు, తిరుమల లడ్డూ ఇలా ఏ అంశం తీసుకున్నా, విపక్ష వైసీపీ కంటే షర్మిల ఒక అడుగు ముందున్నారు. సింపుల్‌గా విపక్ష వైసీపీ రోల్‌ను షర్మిల పోషిస్తుందని చెప్పవచ్చు. అధికార పార్టీని ప్రశ్నించాల్సిన వైసీపీ నేతలు ప్యాలెస్‌కు పరిమితమయ్యారనే వాదనలు సైతం లేకపోలేదు.