ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం దసరా పండుగను పురస్కరించుకొని గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో సామాన్య కుటుంబాలకు మాత్రం ఆర్థిక భారం తగ్గినట్లేనని చెప్పవచ్చు. నేటి రోజుల్లో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులే కాదు.. ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అలాగే కూరగాయల ధరలు చూస్తే కొద్దిరోజులు ఆకాశాన్ని.. మరి కొద్దిరోజులు నేలను తాకుతున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనతో కొంత ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుంది.
కాగా రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరు ప్రతినెలా ప్రభుత్వం అందించే రేషన్ పొందుతూ.. లబ్ది పొందుతున్నారు. అయితే వీరందరికీ ఇప్పటి వరకు ఇస్తున్న రేషన్ తో పాటు.. తక్కువ ధరకు కందిపప్పు, చక్కెర అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించారు.
తెనాలిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. తక్కువ ధరలకు కందిపప్పు, చక్కెర అందించడం వల్ల 4.32 కోట్ల మంది ప్రజానీకం లబ్ది పొందుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర తగ్గించిన ధరకే పంపిణీ చేస్తామని తెలిపారు. అసలే పండుగల కాలం కావడంతో ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటనపై సర్వత్రా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ధరల విషయంలోకి వెళితే.. బయట మార్కెట్ లో క్వాలిటీని బట్టి కందిపప్పు ధర రూ.170 వరకు పలుకుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం రేషన్ షాప్ ల ద్వారా.. కేవలం రూ.67లకే అందించనుంది. అలాగే కేజీ చక్కెర ధర మార్కెట్‌లో రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది.
ఇలా ప్రభుత్వ ప్రకటనతో సాధ్యమైనంత వరకు బయటి మార్కెట్ వ్యాపారస్తులు సైతం ధరలను తగ్గించే అవకాశం ఉంది. అయితే ధరలు తగ్గించారు.. ప్రకటన ఇచ్చారు సరే కానీ.. రేషన్ షాప్స్ ద్వారా వీటి విక్రయాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుండి వినిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే రేషన్ షాపులపై అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ.. కార్డుదారులందరికీ కందిపప్పు, చక్కెర నిర్ణయించిన ధరలకు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా డీలర్లు వీటిని బ్లాక్ మార్కెట్ కు తరలించే ప్రయత్నం చేసినా.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ దసరా కానుకను తీసుకోండి.. డోంట్ మిస్ !