మహారాష్ట్ర మాతగా ఆవు-ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం…!

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్రలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల పవిత్ర జంతువైన ఆవును రాజ్యమాతగా నిర్ణయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నానాటికీ దేశీయ ఆవులు తగ్గిపోతుండటం, ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

 

ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భారతీయ సంప్రదాయంలో గోవులు ఒక ముఖ్యమైన భాగమని, ప్రాచీన కాలం నుండి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సైనిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు దేశీయ ఆవుల సంఖ్య తగ్గిపోతుండంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడను వాడకం అవసరాన్ని కూడా గుర్తుచేసింది. మనుషులు తినే ఆహారంలో పోషకాలు కూడా దీంతో పెరుగుతాయని తెలిపింది.

 

ఆవు, దాని ఉత్పత్తులకు సంబంధించిన సామాజిక-ఆర్థిక అంశాలతో పాటు మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని దేశీయ ఆవులను పెంచడానికి పశువుల పెంపకం దారులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మన దేశంలో ఆవుకు తల్లి హోదా ఇచ్చారని, హిందువులకు ఇది పూజ్యనీయమైనదని తెలిపింది. అంతే కాకుండా ఆవు పాలు, మూత్రం, పేడను పవిత్రంగా భావించి సమృద్ధిగా ఉపయోగిస్తారని వెల్లడించింది. ఆవు పాలు మానవ శరీరానికి చాలా మేలు చేస్తాయని, అలాగే ఆవు మూత్రం అనేక వ్యాధులను నయం చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *