ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుండి వైసీపీ కొంచెం త్వరగానే తేరుకున్నట్లు ఉంది. అందులో భాగంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిని ప్రకటించిందనే వాదన వినిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ఇంకా ఆలోచన చేయక మునుపే వైసీపీ అభ్యర్థిని అప్పుడే రంగంలోకి దించింది. ఇంతకు ఏపీలో జరగనున్న ఎన్నికలు ఏంటి ? వైసీపీ స్పీడ్ ఎందుకు ? అసలు ఆ అభ్యర్థి ఎవరనే విషయాలు తెలుసుకుందాం.
ఏపీలో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఈ స్థానాలు మార్చిలోనే ఖాళీ కాగా.. ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించగా.. ఓటర్లు నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉంటే ఏపీలో సాధారణ ఎన్నికల తరువాత జరగనున్న తొలి ఎన్నికలు ఇవే. ఇప్పటికే గత ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన వైసీపీ ఈసారి కొంత తొందరగానే తేరుకుంది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసేందుకు వైసీపీ ఇప్పటి నుండే తన వ్యూహాన్ని అమలు పరుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని అందుకొని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటిచెప్పాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయా జిల్లాల పరిధిలోని వైసీపీ నేతలను మాజీ సీఎం జగన్ అప్రమత్తం చేసి, ఇప్పటికే విజయావకాశాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారట. గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నేత, సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతంరెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే టిడిపి కూటమి మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో కూడా లేనట్లే ఉంది. అయితే వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు టీడీపీ వ్యూహంలో ఉందని సమాచారం. ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రాధాన్యత సంతరించుకొని ఉండగా.. గెలుపు సాధనకు ఇప్పటి నుండే పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో విజయం మనదే కావాలన్న రీతిలో ఇప్పటికే లోకల్ నాయకులతో సమావేశమైంది. ఇలా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్పీడ్ కాగా.. టీడీపీ స్లోగానే అడుగులు వేస్తోంది. టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపితే మాత్రం స్పీడ్ పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో కానీ.. గెలుపు మాత్రం పార్టీలకు కీలకం కానుంది.