రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరి అరెస్ట్.. హత్యకు కుట్ర..?

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు, భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆ ఇద్దరు వ్యక్తుల సెల్ ఫోన్లలో రాజా సింగ్ ఫొటోలతోపాటు గన్స్, బుల్లెట్లు కనిపించాయి. దీంతో రాజా సింగ్ హత్యకు కుట్ర చేస్తున్నారా? అనే అనుమానంతో వారిద్దరిని పోలీసులకు అప్పగించారు.

 

నిందితులను ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు పోలీసులు. రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంపై వీరిని ప్రశ్నిస్తున్నారు. రాజా సింగ్ హత్యకు కుట్ర చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. సెప్టెంబర్ 27న మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి రెక్కీ చేశారని, తన ఇంటి ఫొటోలు, వీడియోలు తీశారని తెలిపారు.

 

అనుమానం వచ్చి స్థానికులు వాళ్లను స్థానికులు పట్టుకున్నారని.. అందులో మరో ఇద్దరు పరారయ్యారని రాజా సింగ్ చెప్పారు. స్థానికులు వారి ఫోన్ తెరిచి చూడగా తన ఫొటోలు, తన ఇంటి లొకేషన్ ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారని తెలిపారు. పట్టుకున్న ఇద్దరు యువకులను మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారని, పోలీసుల విచారణ కొనసాగుతోందని రాజా సింగ్ చెప్పారు.

 

మరోవైపు, ఈ విషయంపై వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి కాల్ చేసి చెప్పినట్లు రాజా సింగ్ తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేద్దామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి తెలిపారని చెప్పారు. అయితే, ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నా నిందితుడి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు.

 

2010లో కూడా తన ఇంటి వద్ద రెక్కీ చేశారని, గతంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్ట్ చేశారని రాజా సింగ్ తెలిపారు. ఆ తర్వాత కూడా తన గురించి చాలా సార్లు రెక్కీ జరిగిందన్నారు. ఇప్పుడు తన వద్ద రెక్కీ చేసిన వారు షేక్ ఇస్మాయిల్(30), మహమ్మద్ ఖాజా(24) అని, వారిది బోరబండ ప్రాంతమని చెప్పారు. ఎందుకు తన ఇంటికి వచ్చారు? వీరి వెనుక ఎవరున్నారు? ఏం కుట్ర జరుగుతోంది? అనేది తెలియాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *