ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. !

ఏపీలో అధికారం చేజిక్కించుకోవాలనుకున్న సీఎం చంద్రబాబు కల నెరవేరింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి అధికారంలోకి రాగా.. సీఎం చంద్రబాబు పాలనాపగ్గాలు చేపట్టారు. ఇక వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పటివరకు అన్ని పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు సమయాన్ని కేటాయించింది. చంద్రబాబు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడని పేరు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా.. భారీ పరిశ్రమలు తరలిరావాలన్నా.. అది బాబు తోనే సాధ్యమని ప్రజల విశ్వాసం. దీనికి ప్రధాన కారణం గతంలో బాబు పరిపాలించిన తీరేనని చెప్పవచ్చు.

 

వంద రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో.. తన మార్కు పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఒకరకంగా అసలైన వర్క్ సీఎంగా చంద్రబాబు ఇప్పుడే స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. మొన్నటి వరకు విజయవాడ వరదల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. అందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబును ఇంటర్నేషనల్ సంస్థగా గుర్తించబడ్డ లులు గ్రూప్ కంపెనీ ప్రతినిధులు కలిశారు.

 

అమరావతిలో సీఎం చంద్రబాబును లులు గ్రూప్ కంపెనీ సమస్త చైర్మన్ యూసుఫ్ అలీ తన బృందంతో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకు రాగా.. సంస్థ చైర్మన్ ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వైజాగ్ లో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతి నగరాలలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మాణంతో పాటు, పలు పరిశ్రమల ఏర్పాటుకు యూసుఫ్ ఆలీ ఆసక్తి చూపారు. అయితే ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీ వైపుకు రావడంతో.. ఇక భారీ పరిశ్రమలు ఏపీ బాట పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వ్యాపార వర్గాల అంచనా. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నూతన పాలసీలను తీసుకు వస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వైపు తాము వచ్చేది లేదంటూ.. ప్రకటించిన లులు గ్రూప్ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేందుకు.. చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపినట్లు టీడీపీ క్యాడర్ తెలుపుతోంది. భారీ పరిశ్రమలు ఏపీకి తరలివస్తే.. రాష్ట్రం నుండి వలసల నివారణ సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంను అభివృద్ది పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు సాగుతుండగా.. మరో వైపు పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపుకు వచ్చేలా చంద్రబాబు దృష్టి సారించారని చెప్పేందుకు లులు భారీ పెట్టుబడులే ఉదాహరణగా చెప్పవచ్చని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏదిఏమైనా లులు రాకతో రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *