ఏపి లో కొత్త మద్యం దుకాణాల ఫీజులు, మార్గదర్శకాలు ఖరారు..!

ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటనకు సిద్దమైంది. అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయిన బ్రాండెడ్ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు రిటైల్ విధానంలోనే అమ్మకాలు సాగనున్నాయి. ఇందు కోసం లైసెన్సు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.

 

కొత్త నిర్ణయాలు

నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మద్యం ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది, దీంతో రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% అంటే 340 దుకాణాల కేటాయింపు. తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మధ్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది.

 

బ్రాండెడ్ మద్యం అమ్మకాలు

ఇదే సమయంలో చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సీసా ధరలు తెలంగాణలో రూ.140, కర్ణాటకలో రూ.80, తమిళనాడులో రూ.90, ఒడిశాలో రూ.90గా ఉన్నందున వాటి సగటును పరిగణనలోకి తీసుకుని ఏపీలో క్వార్టర్‌ రూ.99గా ఉండాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన బ్రాండ్లను తొలగించి, వాటి స్థానంలో గతంలో ఉన్న పాపులర్‌ బ్రాండ్లను ప్రవేశపెట్టనుంది. సాధారణ లిక్కర్‌ షాపులతో పాటు కేవలం ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్‌ షాపులకూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 ఎలైట్‌ షాపుల ప్రారంభానికి అనుమతివ్వనుంది.

 

లైసెన్సు ఫీజులు

మద్యం దుకాణాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న దుకాణాలను రద్దుచేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌ విడుదల అనంతరం దరఖాస్తులను ఆహ్వానిం చనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన వైన్‌షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పదివేలు జనాభా ఉన్న చోట రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలు ఉన్న చోట రూ.55లక్షలు, 50 వేల నుంచి 5 లక్షలు జనాభా వరకు రూ.65 లక్షలు, 5 లక్షలకుపైన ఉన్నచోట రూ.85 లక్షలు లైసెన్స్‌ ఫీజుగా నిర్ణ యించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *