నిన్ను చూడాలని సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) తొలి పరిచయంలోనే అందరి మన్ననలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది వంటి మాస్ చిత్రాలతో కూడా ఆకట్టుకున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడంలో ఈయన శైలి కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పవచ్చు. పాత్ర ఏదైనా సరే జీవించి నటిస్తారు అందుకే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.
తొలిరోజే రూ.172 కోట్లు..
ఇకపోతే చివరిగా సోలో హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆయన సినిమా చేయలేదు. మళ్ళీ రెండు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించారు.. ఈ సినిమా తర్వాత దేవర కోసం మరో రెండేళ్ళు. అలా మొత్తంగా ఆరు సంవత్సరాల తాను సోలో హీరోగా రావడానికి సమయం పట్టింది.ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి. రూ .125 కోట్ల తొలిరోజు టార్గెట్ తో బరిలోకి దిగగా ఏకంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది.
నాన్ రాజమౌళి రికార్డ్స్ బ్రేక్ చేసిన దేవర..
ఒకరకంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ సినీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు ఇండియన్ సినిమాలో కూడా రేర్ ఫీట్ అందుకుందని చెప్పాలి. ముఖ్యంగా నాన్ ఎస్ఎస్ రాజమౌళి రికార్డులను బ్రేక్ చేశారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తొలి రోజు ఏకంగా రూ.223.5 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన కూడా బాహుబలి ది కంక్లూజన్ కూడా తొలి రోజు రూ.214.5 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ రెండు కూడా రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన చిత్రాలు కావడం విశేషం.
అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేవర..
అయితే ఈ సినిమాల తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2 – రూ.164.4 కోట్లు తొలిరోజు రాబట్టగా, ఆ తర్వాత ఆదిపురుష్ రూ.136.8 కోట్లు, సాహో రూ.125.6 కోట్లు, రోబో 2.0 రూ.105.6 కోట్లు , పఠాన్ రూ.104.8 కోట్లు, జైలర్ రూ. 91.2 కోట్లు, కబాలి రూ.90.5 కోట్లు, పొన్నియన్ సెల్వన్ 1 రూ .83.6 కోట్లు మొదటి రోజు రాబట్టాయి.. దీన్ని బట్టి చూస్తే నాన్ ఎస్ఎస్ రాజమౌళి రికార్డులను దేవర సినిమా బ్రేక్ చేసింది. దేశంలోనే తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది దేవర. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాల మధ్య వచ్చి అంతకుమించి కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టిస్తోంది. రూ.350 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.