నగరి మాజీ ఎమ్మేల్యే రోజా రూటే సపరేట్.. తాను ఏది మాట్లాడినా వైరల్ కావాల్సిందే. వైసీపీ లో పదునైన విమర్శలు చేసే ఫైర్ బ్రాండ్ గా రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏపీలో కూటమి గెలుపు అనంతరం కొంత గప్ చుప్ గా ఉన్న రోజా.. ఒక్కసారిగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా.. రోజా మళ్లీ ఫైర్ బ్రాండ్ అవతారమెత్తారు. ఆమె చేసిన విమర్శలపై టీడీపీ నేతలు గరంగరం కాగా.. సోషల్ మీడియాలో రోజాపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కల్తీ నెయ్యి పాపం వైసీపీదే అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇక అప్పటి నుండి మొదలైన వివాదం నేటికీ పలు మలుపులు తిరుగుతోంది. కాగా కల్తీ నెయ్యి వివాదంలో టీడీపీ ఎదురుదాడిని తట్టుకునేందుకు.. వైసీపీ సైతం పాప ప్రక్షాళన పేరిట రాష్ట్రంలోని అన్ని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయాలని తమ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు వైసీపీ క్యాడర్ సైతం పూజలలో పాల్గొన్నారు.
ఇది ఇలా ఉంటే మీ అందరిదీ ఒక దారి.. నా దారి రహదారి అనే రీతిలో మాజీ మంత్రి రోజా మాత్రం మధురైలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతటితో ఆగక అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ లపై ఘాటు విమర్శలు చేశారు. పక్క రాష్ట్రానికి వెళ్ళి జగన్ ఆదేశాలు పాటించిన రోజా ఏమన్నారంటే.. రాజకీయాల కోసం కలియుగ వైకుంఠం శ్రీశ్రీనివాసుడిని టీడీపీ కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేస్తుందన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డుపై వచ్చిన సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో.. భక్తులు లడ్డు తీసుకోవాలా.. తినాలా.. వద్దా అనే సంకోచంలో ఉన్నట్లు తెలిపారు. తమ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ను రాజకీయంగా జీరో చేసే కుట్రలో భాగమే.. తిరుమల లడ్డు వివాదాన్ని కూటమి తెచ్చిందన్నారు. అంతటితో ఆగక చంద్రబాబుకు బుద్ది రాలేదు.. దొంగ రిపోర్టును తెచ్చి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్దం చెబుతున్నట్లు, గతంలో వెయ్యి కాళ్ల మండపం కూల్చినందుకే.. బాబు కి అలిపిరి ఘటన జరిగిందని రోజా విమర్శించారు.
అలాగే డిప్యూటీ సీఎం పవన్ పై అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు రోజా. పాపం పవన్ కు ఏమీ తెలియదు.. ఏది రాసిస్తే అది మాట్లాడుతారన్నారు. తన భార్య క్రిస్టియన్ అని చెప్పిన పవన్.. ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం అంటున్నారని ఘాటుగా విమర్శించారు. అసలు దేవుడిపై భక్తి ఉంటే నెయ్యి కల్తీ వివాదంపై విచారణ జరిపి, తప్పు చేసిన వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా రోజా చేసిన విమర్శలపై టీడీపీ సోషల్ మీడియా ఎదురుదాడికి దిగింది. ఇలా ఫైర్ బ్రాండ్ మాటలు మాట్లాడినందుకే వైసీపీ ఘోర ఓటమి చవిచూసిందని విమర్శలు కురిపించింది. ఏదిఏమైనా లడ్డు వివాదంపై రోజురోజుకూ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల వార్ సాగుతుండగా.. ప్రభుత్వం మాత్రం సిట్ విచారణకు ఆదేశించి, నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది