తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు.. సెప్టెంబర్ 30న విచారణ..

తిరుమల దేవాలయం లడ్డూలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) సెప్టెంబర్ 30న విచారణకు రానున్నాయి. బిజేపీ సీనియర్ లీడర్ సుబ్రమణియన్ స్వామి, తిరుమల తిరపతి దేవస్థానం (టిటిడి) మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ పిటీషన్లు దాఖలు చేశారు.

 

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలపై ఒక స్వతంత్ర విచారణ కమిటీ చేత విచారించాలని సుబ్రమణియన్ స్వామి తన పిటీషన్‌లో పేర్కొనగా.. ఆ కమిటీకి ఒక మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరించాలని మాజీ టిటిడి అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తన పిటీషన్‌లో డిమాండ్ చేశారు. ఈ రెండు పిటీషన్ల విచారణ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం చేపట్టనుంది. జస్టిస్ బిఆర్ గవై, కెవి విశ్వనాథన్ ఈ ధర్మసనంలో ఉంటారు.

 

తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వివరాలతో ఒక నివేదిక సమర్పించాలని బిజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి తన పిటీషన్ లో కోరారు. దేవాలయంలో లడ్డూ నాణ్యత చెకింగ్, లడ్డూ తయారీ ప్రక్రియ అందులో పదార్థాలు, వాటి సప్లయర్ల వివరాలు అన్నీ నివేదికలో పొందుపర్చాలని సుబ్రమణియన్ స్వామి అన్నారు.

 

తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 9 మంది సభ్యులు గల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసి లడ్డూలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు అంశంపై విచారణకు ఆదేశించింది. సెప్టెంబర్ 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ వివాదంపై సిట్ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.

 

అయితే తిరుమల లడ్డూ తయారీలో గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటకకు చెందిన నందిని నెయ్యి ఉపయోగించేవారు. కానీ వైసీపీ పాలనలో ఆ కాంట్రాక్టు రద్దు చేసి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం ప్రారంభించారు. నందిని నెయ్యి కంటే ఏఆర్ డైరీ చాలా తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేసేందుకు అంగీకరించడంతోనే ఈ మార్పులు చేసినట్లు అప్పటి టిటిడి కమిటీ తెలిపింది. కానీ ఏఆర్ డైరీ పంపిణీ చేసే నెయ్యిలో నాణ్యత లేదని ఫలితంగా దాంతో తయారైన లడ్డూలో నాణ్యత లోపించిందని చాలా మంది భక్తులు గత కొన్ని నెలలుగా ఫిర్యాదులు చేశారు.

 

దీంతో జూలై 2024లో లడ్డూ నాణ్యతపై గుజరాత్ కు చెందిన ఒక జాతీయ డైరీ లేబరేటరీ పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలింది. లడ్డూ తయరీకి ఉపయోగించే నెయ్యిలో చేప నూనె, బీఫ్ కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు ఉన్నట్లు గుజరాత్ జాతీయ డైరీ లెబరేటరీ తన రిపోర్ట్ లో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *