కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్..

రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జలసౌధలో కొత్తగా నియమకమైన ఏఈఈలకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం, అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారని అక్కడి వారితో అన్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోందన్న సీఎం, ఇది మీకు ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని, వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.

 

‘‘ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజినీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈమధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే, కట్టడం, కూలడం రెండూ జరిగాయి’’ అని అన్నారు రేవంత్ రెడ్డి. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలన్నారు. అధికారులనా? రాజకీయ నాయకులనా? అని మాట్లాడారు.

 

‘‘మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్ మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావొద్దు’’ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకమన్న సీఎం, ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. రికెమండేష‌న్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందరూ పని మీద శ్రద్ధ పెట్టాలని, పోస్టింగుల మీద కాదని చురకలంటించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్న రేవంత్ రెడ్డి, క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *