తిరుమల పరిరక్షణ చేసే వారికి ఛైర్మన్ పదవి..!

ఇటీవల తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి అపవిత్ర వివాదం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసీన విషయం అందరికీ తెలిసిందే. తిరుమల లడ్డు అంటేనే మహా ప్రసాదంగా భావించి స్వీకరించే భక్తులకు ఈ ఉదంతం ఆగ్రహం తెచ్చిందనే చెప్పవచ్చు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛైర్మన్లుగా భాద్యతలు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై టీడీపీ విమర్శల వర్షం కురిపించింది. వీరిలో ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి పై మాత్రం పదునైన విమర్శలే వినిపించాయి. వైసీపీ హయాంలో టీటీడీ నిర్వహణపై నిర్లక్ష్యం సాగిందని, భక్తులు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనే వాదనను టీడీపీ బలంగా వినిపించింది.

 

అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. మొదటగా తిరుమల నుండే ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా టీటీడీ ఈవోగా శ్యామల రావును నియమించింది. ఇక ఛైర్మన్ విషయానికి వస్తే.. ఎవరిని నియమించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చెప్పవచ్చు. ఈ తరుణంలోనే తిరుమల లడ్డు వివాదం రావడం, దేశ వ్యాప్త చర్చకు దారి తీయడంతో అతి త్వరగా ఛైర్మన్ ను నియమించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుమల పవిత్రతకు భంగం రాకుండా.. అన్ని విధాలుగా భక్తుల సంక్షేమం, తిరుమల పరిరక్షణ చేసే వారికి ఛైర్మన్ పదవి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పవచ్చు.

 

తొలుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, మెగా బ్రదర్ నాగబాబు పేర్లు ఛైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు వినిపించాయి. అయితే నాగబాబు తాను ఆ రేసులో లేనట్లు ప్రకటించారు. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా టీటీడీ ఛైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్.వి.రమణను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే తొలిసారిగా టీటీడీ ఛైర్మన్ భాద్యతలు చేపట్టిన న్యాయమూర్తిగా గుర్తించబడనున్నారు జస్టిస్ రమణ. హిందుత్వవాది.. తిరుమల శ్రీనివాసుడి పరమ భక్తులైన ఎన్.వి.రమణ నియామకంతో టీటీడీ ప్రక్షాళన సాధ్యమేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కావచ్చని, ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరగా టీటీడీ ఛైర్మన్ ను నియమించే అవకాశాలు ఆధికంగా ఉందని భోగట్టా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *