తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30..!

తిరుమల లడ్డూ వివాదం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. గత ప్రభుత్వం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ మేరకు ఈ లడ్డూ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ వివాదంపై వైసీపీ కూడా స్పీడ్ పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ నాయ‌కుల‌పై ఎదురు దాడికి దిగారు.

 

ఇందులో భాగంగానే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్రవారం తిరుమ‌ల‌కు రానున్నట్లు ప్రకటించారు. తిరుమ‌ల ప్ర‌సాదంపై వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకోనుంది. అలాగే సెప్టెంబర్‌ 28న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని త‌మ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. అయితే శుక్రవారం రాత్రి వరకు జగన్ తిరుమలకు చేరుకోనున్నారు.

 

తిరుమల పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న జగన్.. రేణిగుంట చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు తిరుమలకు చేరుకుంటారు. ఈ మేరకు శనివారం ఉదయం 10.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

 

ఇదిలా ఉండగా, మాజీ సీఎం జగన్ కాలి న‌డ‌క‌న ఆయ‌న తిరుమ‌ల చేరుకోనున్నారు. కాగా, జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనున్నారు. అయితే, తిరుమ‌ల‌లో జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేసిన త‌ర్వాతే ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే డిమాండ్ కూట‌మి నేత‌ల నుంచి వ‌స్తోంది. ఇదే ఇప్పుడు ఉద్రిక్త‌త‌కు దారి తీస్తోంది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ నేత‌లు పిలుపునిచ్చారు. దీంతో తిరుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తుండటంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.

 

వైఎస్ జగన్ తిరుమలకు రానున్న సందర్భంగా తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు తిరుపతిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వెల్లడించారు.

 

జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని ఎస్పీ తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గత కొంతకాలంగా తిరుమల, తిరుపతితోపాటు రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలరోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

 

అలాగే పోలీస్ శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించ వద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *