మా అన్న ముంచాడు.. మీరైనా ఆ పని చేయండి.. షర్మిళ కామెంట్స్..

గత ప్రభుత్వం ముంచింది.. మీరు కూడా ఆ బాటలో నడవద్దు.. సూపర్ సిక్స్ ఎక్కడ.. ప్రజలు మీకు ఓటేశారు.. మీరు గద్దెనెక్కారు.. ఇంతకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా లేవా.. అంటూ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న షర్మిళ ఒక్కసారిగా టీడీపీ కూటమి ప్రభుత్వం, వైసీపీ, బిజెపిపై విమర్శల జోరు పెంచారు.

 

విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘థాలీ బజావో’ కార్యక్రమంలో వైయస్ షర్మిళ పాల్గొన్నారు. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల అమలును కోరుతూ ఈ కార్యక్రమం సాగగా.. పళ్లెం, గంటెలతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా షర్మిళ థాలీ సౌండ్ చేయగా.. నాయకులు, కార్యకర్తలు సైతం జత కలిశారు. అనంతరం షర్మిళ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. వాటి అమలు గురించి పట్టించుకోక పోవడం తగదన్నారు. అలాగే బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగులు ఆశ పడ్డారని చివరికి వారికి భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం చేయకపోవడం శోచనీయమన్నారు. వరదలతో నష్టపోయిన రైతన్నల పరిస్థితి ఏమిటి ? తల్లికి వందనం ఎక్కడ ? మహాశక్తి పథకం అమలు ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిళ.

అలాగే బిజెపిపై సైతం షర్మిళ విమర్శల జోరు కొనసాగించారు. ఏడాదికి రూ.6వేల కోట్ల ఆదాయం విజయవాడ డివిజన్ ద్వారా రైల్వే శాఖ తీసుకుంటుందన్నారు. కానీ వరద బాధితులకు కనీసం ఒక్క రైల్ నీర్ బాటిల్ కూడా ఉచితంగా ఇవ్వలేదని, ఇదేనా రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న ప్రేమ అంటూ విమర్శించారు.

 

రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలని, మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు.. బడ్జెట్ లేని రాష్ట్రం కూడా అన్నారు. టీడీపీ కూటమి హామీలు నమ్మిన ప్రజలు కూటమికి ఓటేశారని, అందుకే రాష్ట్రంలో భారీ మెజారిటీ కూటమి సొంతమైందన్నారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు కూటమిని నమ్మారని, అయితే రోజురోజుకు కూటమి కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందన్నారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తుందో.. శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

 

అయితే షర్మిళ తన కామెంట్స్ లో గత వైసీపీ ప్రభుత్వంపై, బిజెపిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో భారీ ఓటమి చెందిన వైసీపీని షర్మిళ టార్గెట్ చేస్తూ విమర్శించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తన సోదరుడు, మాజీ సీఎం జగన్ తన పాలనతో ప్రజలను నట్టేట ముంచారని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా షర్మిళ కామెంట్స్ కి టీడీపీ కూటమి నేతలు ఎలా స్పందించినా.. వైసీపీ నేతలు స్పందించే అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *