వైసీపీ పాపప్రక్షాళన..? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు..!

తిరుమల లడ్డు వివాదం మరింత ముదురుతోందా.. టీడీపీ – వైసీపీ మధ్య ఈ వివాదం ఇంకా రగులుతోందా.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా.. అదే దారిలో వైసీపీ కూడా నడుస్తోందా అంటే అవుననే చెప్పవచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యి అపవిత్రం అయిందంటూ సీఎం చంద్రబాబు ఘాటు విమర్శల జోరు సాగించారు. బాబు చెప్పిన ఆ ఒక్క మాట తూటాలా పేలగా.. వైసీపీపై, మాజీ సీఎం వైయస్ జగన్ పై దేశ వ్యాప్తంగా విమర్శల జోరు సాగింది. మరికొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా వైయస్ జగన్ ప్లకార్డులతో నిరసనలు సైతం సాగాయి. మరి తమపై వచ్చిన ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు వైసీపీ రెడీ అవుతోందని చెప్పవచ్చు.

 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ ఘటనపై స్పందిస్తూ.. లడ్డు కల్తీ వ్యవహారంలో తప్పందా నాటి ప్రభుత్వానిదే.. తిరుమల పవిత్రతను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అంతటితో ఆగక నాటి టీటీడీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల ప్రమేయం సైతం ఉందని విమర్శించారు. కానీ వైసీపీ సైతం అదే స్థాయిలో వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. చివరకు ఏపీ ప్రభుత్వం నెయ్యి అపవిత్రం వ్యవహారంపై సిట్ విచారణకు సైతం ఆదేశించింది. సిట్ విచారణ అధికారులుగా సిన్సియర్ పోలీస్ అధికారులను నియమించి విచారణ చేపట్టింది ప్రభుత్వం. అసలు లడ్డు తయారీలో నాడు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా.. లేదా అనే ప్రశ్నకు సమాధానం సిట్ విచారణలో తేలాల్సి ఉంది. కానీ వైసీపీ మాత్రం సిబిఐ విచారణ చేయాలంటూ తన వాదన వినిపిస్తోంది.

 

అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఇక తమ మీద పడ్డ మచ్చను తొలగించుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పవచ్చు. అందుకే ఈ నెల 27న మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళుతున్నట్లు సమాచారం. 28న ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.

 

వైసీపీ ఇచ్చిన ఈ పిలుపుపై తాము చేసిన తప్పుల నుండి వైసీపీ ప్రాయశ్చిత్తం పొందేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనలో జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోసమే దీక్ష చేపట్టారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తాజాగా పవన్ దీక్షపై విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలే వైసీపీకి రివర్స్ అయ్యాయని, తమ పాలన సమయంలో జరిగిన మహా పాపానికి ప్రాయశ్చిత్తం కోసమే వైసీపీ అన్ని ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ఏదిఏమైనా తిరుమల లడ్డుకి ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల పర్యటన సంధర్భంగా జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *