రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో బాధ పడుతుంటే ఇక్కడి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్కడ ? అతని ఆచూకీ వెతికి పెట్టండి అంటూ సిరిసిల్ల వాసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇటు అధికార పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లకు చెందిన కోడె రమేష్ అనే వ్యక్తి తమ ఎమ్మెల్యే కేటీఆర్ పై గంభీరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారని, వీటిపై స్పందించాల్సిన తమ ఎమ్మెల్యే కేటీఆర్ కనబడటంలేదని, అతడి ఆచూకీని కనిపెట్టాలంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆ ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు. ‘సిరిసిల్ల నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే గారి ఆచూకీ కోసం ఫిర్యాదు చేస్తున్నాను. పై విషయం తమరితో మనవి చేయునది ఏమనగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకున్నా.. ఎలాంటి రాజకీయ అనుభవం పరిజ్ఞానం లేకుండా అయ్య పేరు చెప్పుకుని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల గడ్డను గాలికి వదిలేసి గత కొన్ని నెలలుగా ప్రజలు నియోజకవర్గంలో అనేక సమస్యలతో సతమతం అవుతుంటే సిరిసిల్ల నియోజకవర్గ వలసవాది కేటీ రామారావు గారు మాత్రం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోయారు. మరి ముఖ్యంగా మా గంభీరావుపేట మారుమూల మండలం 3 జిల్లాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట – లింగన్నపేట వాగుపై హైలెవల్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి గొప్ప హంగు ఆర్భాటాలతో, ర్యాలీలతో పాలభిషేకాలు చేయించుకొని ఉన్న లోలెవల్ బ్రిడ్జిని కాంట్రాక్టర్ తో కుమ్మక్కై కూల్చివేసి సలాకీని కూడా అమ్ముకోవడం వల్ల వర్ష ప్రభావంతో రైతులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంట్రాక్టర్, ఎమ్మెల్యేపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా చూడాలని మనవి’ అంటూ అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో ఈ అంశం స్థానికంగానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసింది. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై స్పందించాలంటూ కేటీఆర్ ను కోరుతున్నారు. నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చి, సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు.