కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో భాగంగా మంగళవారం కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఏజెన్సీలకు రూ. 1,600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీలను ఏజెన్సీలకు ఇచ్చేముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా? అంటూ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది.
ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే విడుదల చేసినట్టు వారు పేర్కొన్నారు. ఆనకట్టల వద్ద డ్యామేజ్ కు గల కారణాల గురించి వారిని కమిషన్ అడిగి తెలుసుకుంది. అనుకున్నదానికంటే ఎక్కువగా వరద రావడం వల్లే సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నట్లు ఇంజినీర్లు కమిషన్ కు తెలియజేశారు. 2022 జులైలో వచ్చిన భారీ వరదల కారణంగా సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నాయని, డ్యామేజీ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కూడా వారు కమిషన్ కు తెలియజేశారు.
డిజైన్లు, డ్రాయింగ్ లను గురించి కూడా కమిషన్ వారిని ప్రశ్నించింది. దీంతో వారు సమాధానమిస్తూ వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిందంటూ కమిషన్ కు సమాధానమిచ్చారు. సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్టు వారు పేర్కొన్నారు. నిర్మాణానికి ముందు సైట్లలో ఏమైనా పరీక్షలు నిర్వహించారా? అని వారిని కమిషన్ ప్రశ్నించగా ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయని ఇంజినీర్లు వివరణ ఇచ్చారు.