తిరుపతి లడ్డూ వ్యవహారం రోజు రోజు మరింత ముదురుతోంది. ఇప్పటికే అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ వివాదంలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానన్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఆయన అనర్హుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలసిపోయాను. ఆయన మాటలు వినలేకపోయాను. పవన్ కల్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి కాదు. వెంటనే రాజీనామా చెయ్. నీకు ఎవరో సరైన సలహా ఇవ్వడం లేదు. చరిత్ర హీనుడివి కాకూడదు. దయచేసి హిందూ, ముస్లీం, క్రిస్టియన్ మధ్యలో గొడవలు పెట్టొద్దని భావించారు. రాష్ట్రాన్ని విభజించవద్దు” అని పాల్ రిక్వెస్ట్ చేశారు.
తిరుపతిని కేంద్రపాలి ప్రాంతం చేయండి- పాల్
తిరుపతి పవిత్రత దెబ్బతినకూడదంటే వెంటనే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు. “తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా డిక్లేర్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాను. అలా చేస్తేనే, మూడు లక్షల కోట్ల వేంకటేశ్వరుడి ఆస్తులను కాపాడుతాం. హిందూ, ముస్లీం, క్రిస్టియన్ మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. తిరుపతిలో అపవిత్రత జరిగితే నేను తీవ్రంగా ఖండిస్తాను. నేను క్రిస్టియానిటీని తీసుకోక ముందు.. మానాన్న నన్ను తిరుపతికి తీసుకెళ్లారు. పాప నాశనిలో ముంచి శ్రీనివాస్ అని పేరు పెట్టారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. అందుకే ప్రపంచ శాంతిదూతగా పేరుపొందాను. 200 దేశాల్లో 200 కోట్ల మందికి హీరోగా నిలబడ్డాను” అని చెప్పుకొచ్చారు.
సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ను ఎందుకు అమ్ముతున్నారు?-పాల్
ఓవైపు తిరుమల వివాదాన్ని చూపిస్తూ మరోవైపు సీక్రెట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పాల్ విమర్శించారు. “తిరుపతి వివాదాన్ని చూపిస్తూ, సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ను ఎందుకు అమ్మేస్తున్నారు? ఎన్నికల వేళ రూ. 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోడీ హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు కనిపించకుండాపోయారు. మా ప్రభుత్వం వస్తే నేను వారి కోసం కొట్లాడుతానన్నారు పవన్ కల్యాణ్. ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదో చెప్పాలి. 2007లో నన్ను మీరే నా హీరో అన్నావు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాకు మద్దతుగా రాజశేఖర్ రెడ్డిని తిట్టావు. నిన్ను ప్రశంసించాను పవన్ కల్యాణ్. ఈ రోజులు ఎందుకు మతాల మధ్య గొడవపెట్టే ప్రయత్నం చేస్తున్నావ్? ఈ రోజు గాంధీ, అంబేద్కర్, పుచ్చలపల్లి సుందరయ్య, ప్రకాశం పంతులును స్మరిస్తున్నాం. ఎందుకంటే వాళ్లు చరిత్రలో శాంతిదూతలు ఉన్నారు. వారి బాటలో మీరూ నడవాలి. మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకూడదు” అంటూ పాల్ సూచించారు.