ఏపీలో అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కూడా వైసీపీకి కలిసిరావడంలేదు. ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసి పెద్ద షాక్ కు గురయ్యింది. ఆ తరువాత ఒకదాని తరువాత మరొకటి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కీలక నేతలు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి, ఒంగోలు కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడి జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై బాలినేని తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. ఆ తరువాత ఆయన జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పనిచేసే వ్యక్తులకు ప్రాధాన్యత కరువైందని, ఈ క్రమంలోనే తాము పార్టీని వీడాల్సి వస్తోందంటూ బాలినేని ఆ సందర్భంగా పేర్కొన్నారు.
తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. జగన్ కు లేఖ రాశారు. తాము పార్టీని వీడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలు.. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, ఆయన సతీమణి నిమ్మకాయల రాజేశ్వరమ్మ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ వ్యవహార శైలి నచ్చక, అసంతృప్తితో పార్టీని వీడుతున్నట్లు వారు ప్రకటించారు. ఏపీపీఎస్సీ సభ్యులుగా సుధాకర్ రెడ్డి పనిచేశారు. ఇటు ఆయన సతీమణి కూడా వీరపునాయునిపల్లె జడ్పీటీసీగా కొనసాగుతున్నారు.
‘జగన్ గారు.. మీరు వైసీపీ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేం మీ వెంటనే నడిచాం. కానీ, ఈరోజు నుంచి మీ వెంట నడవలేకపోతున్నాం. అందుకే పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనా చేస్తున్నాం’ అంటూ వారు జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
2011లో జగన్ కోసం కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి సుధాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిమ్మకాయల దంపతులు మాట్లాడుతూ.. ’13 ఏళ్ల పాటు వైసీపీలో కీలకంగా పని చేశాను. పార్టీ అధినేత కొంతకాలంగా అనుసరిస్తున్న విధానాలు నాకు బాధ కలిగించాయి. విజయవాడ వరదలు చంద్రబాబు వల్లే వచ్చాయంటూ జగన్ అపరిపక్వంగా మాట్లాడారు. సరైన నాయకుడి కాని వారి దగ్గర పనిచేయడం వల్ల సమాజానికి నష్టం చేసిన వారమవుతాం. మంచి నాయకుడిని దగ్గర పనిచేయడానికి మేం రాజీనామా చేస్తున్నాం’ అంటూ వారు పేర్కొన్నారు.