నేను చెప్పిందేంటి.. మీరు తిప్పుతున్నదేంటి.. పవన్ పై ప్రకాష్ రాజ్ ఫైర్..

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న వివాదాల్లో తిరుపతి లడ్డూ వివాదం ఒకటి. తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం తెల్సిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. తప్పు ఎవరిది అనేది ఇంతవరకు తెలియలేదు కానీ, వాదోపవాదనలు మాత్రం గట్టిగా జరుగుతున్నాయి. ఇక ఈ వివాదంలోకి ఇండస్ట్రీ కూడా వచ్చి చేరింది. చాలామంది ప్రముఖులు.. తిరుపతి లడ్డూ వివాదానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది అన్యాయమని.. ఈ కల్తీకి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇంకోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా జరగడం చాలా బాధాకరమని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ” తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు)కలిపినట్లు బయటపడింది. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ, ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలు బయటకు వస్తున్నాయి. మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా మరియు వారి సంబంధిత డొమైన్‌లందరిచే చర్చ జరగాలి. ‘సనాతన ధర్మాన్ని’ ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి ప్రయత్నించినా మనమందరం కలిసి పోరాడాలి” అంటూ చెప్పుకొచ్చారు.

 

ఇక పవన్ కళ్యాణ్ పోస్ట్ పై నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్వేసిన విషయం తెల్సిందే. ఈ వివాదాన్ని నేషనల్ వివాదంగా మార్చవద్దని, దీని ద్వారా మతపరమైన ద్వేషాలను పెంచవద్దని తెలిపాడు. ” డియర్ పవన్ కళ్యాణ్ …మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఈ సమస్యను జాతీయంగా ఎందుకు ఊదరగొడుతున్నారు… ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు” అంటూ సెటైర్ వేసాడు.

 

ఇక ఈ సెటైర్ కు పవన్ నేడు సమాధానమిచ్చారు. ” ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా తెలియజేస్తున్నాను. దీని మీద మీరు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి. లేదంటే మౌనంగా ఉండండి. మీమీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరు” అని ఫైర్ అయ్యారు . ఇక పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యాడు. తాను మాట్లాడింది తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపాడు. ” శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. నేను చెప్పిందేంటి.. మీరు అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి. నేను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను 30 తరువాత వస్తాను. వచ్చాక మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ మధ్యలో మీకు వీలైతే మరోసారి ఆ ట్వీట్ ను మరోసారి చదవండి.. అర్ధం చేసుకోండి.. ప్లీజ్” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *