తెలుగు రాష్ట్రాలకే కాదు, ఇండియా మొత్తానికి తిరుపతి ప్రసాదమైన లడ్డూ అంటే ఎంత ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ లడ్డూ కల్తీ అయింది అనే వార్త దేశం మొత్తాన్ని షేక్ చేస్తుంది. అయితే దీనిపై ఓ సినిమా ఫంక్షన్‌లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పందించాడు. యాంకర్ చూపించిన మీమ్ కి స్పందనగా కార్తీ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. జోకులు వేయొద్దు అంటూ హీరో కార్తీ పై ఫైర్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే..?
భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనుకునే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెల్చింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. లడ్డూలో వాడే నెయ్యిలో పంది, పశువుల కొవ్వును కలిపారు అనే ఆరోపణలు వస్తున్నాయి. గుజరాత్ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ లోనూ ఇదే ఉందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు.
కార్తీ కామెంట్…
ఈ నేపథ్యంలో కల్తీ లడ్డూ అనే టాపిక్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే సోమవారం హైదరాబాద్ లో ఓ సినిమా ఫంక్షన్ జరిగింది. కోలీవుడ్ స్టార్స్ కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో యాంకర్ లడ్డూ కావాలా నాయానా… అనే మీమ్ ని హీరో కార్తీకి చూపించింది. అది చూసిన కార్తీ.. “ఇప్పుడు లడ్డూ గురించి ఏం మాట్లాడొద్దు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ” అంటూ కామెంట్ చేశాడు.
పవన్ సీరియస్…
సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కార్తీ చేసిన కామెంట్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు వచ్చాయి. తాజాగా కార్తీ చేసిన కామెంట్స్ పై స్పందించాడు. “ఈ రోజు లడ్డూపై కామెంట్స్ చేస్తున్నారు. జోక్స్ వేస్తున్నారు. నిన్న ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నాడు. మీరు మరోసారి ఇలా అనొద్దు. హీరోగా మీరు అంటే నాకు చాలా గౌరవం. హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించిండి. అలాగే ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించండి” అంటూ హీరో కార్తీపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
అక్టోబర్ 1న తిరుపతికి పవన్…
తిరుమల లడ్డూ కల్తీ కావడంతో తనను క్షమించమంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ దీక్షను తిరుమల దేవస్థానంలోనే విరమింపచేయబోతున్నారు. అందుకోసం అక్టోబర్ 1న పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల కొండకు చేరుకుని, 2వ తేదీని శ్రీవారి దర్శించుకుని, ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. అనంతరం అక్టోబర్ 3న వారాహి సభను నిర్వహించబోతున్నారు.