విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఉద్యోగుల ఆందోళన మరోవైపు ప్రమాదాలు కలిసి కార్మికులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎల్‌పీబేస్టీల్ ల్యాడిల్ డిపార్టు మెంట్‌లో ఈ ఘటన జరిగింది. సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకోగానే కార్మికులు అక్కడికి చేరుకున్నారు.
మల్లేశ్వరరావు శరీరం దాదాపు 80 శాతం కాలినట్లు ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. ల్యాడిల్ నుంచి ద్రావకం లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టు ఉద్యోగులు చెబుతున్నమాట. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏం జరిగిందనే దానిపై కార్మికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ ఏడాది జనవరిలో కూడా ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్-3లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్మికులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. చీటికీ మాటికీ ఘటనలు జరగడంతో అసలు ప్లాంట్‌లో ఏం జరుగుతోందన్న చర్చ అప్పుడు విశాఖ ప్రజల్లో మొదలైంది.