చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని చెబుతూ.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సోమవారం తీర్పు వెలువడింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రడూచ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ దీనిపై కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన డేటాను వాడటాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. ఇకపై కోర్టులు ఆ పదాన్ని కూడా వాడొద్దని ఆదేశించింది.
చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం, డౌన్ లోడ్ చేయడం.. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం నేరమని పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీ కారణంగా.. పిల్లలపై లైంగిక దాడులు పెరిగే అవకాశాలున్నాయని, చాలామంది దానిని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీని.. చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ అండ్ ఎక్స్ ప్లోటేటివ్ మెటీరియల్ (CSEAM) గా పలకాలని పార్లమెంట్ ఆర్డినెన్స్ ను రూపొందించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది.
28 ఏళ్ల యువకుడు తన స్మార్ట్ ఫోన్ లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్ లోడ్ చేసి చూశాడన్న అభియోగంతో క్రిమినల్ కేసు నమోదవ్వగా.. దానిని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 67-బీ ప్రకారం ఫోన్ లో చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం నేరంగా పరిగణించాలంటే.. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పుల్ని రుజువు చేయాలని పేర్కొంటూ.. అతనిపై కేసును కొట్టివేసింది. పిల్లల్ని ఈ విషయంలో శిక్షించడం కంటే.. వారి విద్యపై దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. దానిపై నేడు కీలక తీర్పు వెలువడింది.