రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. మొన్న హైడ్రాను ఏర్పాటు సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ విషయమై సోమవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణంతోపాటు ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
అయితే, ఈ విషయంలో ‘వన్ స్టేట్ – వన్ డిజిటల్ కార్డు’ విధానాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. రేషన్, ఆరోగ్య సేవలతోపాటు సంక్షేమ పథకాలను ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుంది. కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళికలు వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు.
డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ ను పొందుపరిచి, దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలని పేర్కొన్నారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇటు కర్ణాటక, హరియాణా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.