బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో నిర్వించిన శేరిలింగంపల్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుందని చెప్పి.. రేవంత్ సర్కార్ పేదలను రోడ్డున పడేస్తోందని ఫైర్ అయ్యారు. పేదలను కట్టుబట్టులతో రోడ్లపైకి నెట్టి.. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. గరీబోళ్లకు ఒక న్యాయం, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి మరొక న్యాయమా ? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. చెరువులను ఆక్రమించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ లో తిరుపతిరెడ్డి కమీషన్ల దుకాణం తెరిచాడని స్వయంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే వెల్లడించాడని గుర్తుచేశారు. శేరిలింగంపల్లిలో ఉపఎన్నిక ఖాయమని, బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని, ఇక్కడ కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పగబట్టాడని ఆరోపించారు కేటీఆర్. ఆటో డ్రైవర్లు, బస్తీవాసులు, పేదలే టార్గెట్ గా హైడ్రాను తీసుకొచ్చారని విమర్శించారు. ఇళ్లు కూల్చివేసేటపుడు పుస్తకాలు, సామాన్లు తీసుకుంటామని అడిగితే.. ఒక గంట సమయం కూడా ఇవ్వకుండా నిర్థాక్షిణ్యంగా రోడ్డున పడేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కన్ స్ట్రక్షన్ చేస్తే.. కాంగ్రెస్ హయాంలో డిస్ట్రక్షన్ జరుగుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ లు, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు కడితే.. వీళ్లు మాత్రం 9 నెలల పాలనలో బెదిరింపులు, కూల్చివేతలు, బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్.
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఆక్రమిత ప్రదేశంలో కట్టారని కూల్చివేశారు.. కానీ దానికి పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ హయాంలో అని తెలిపారు. బీఆర్ఎస్ ఆక్రమణలను ప్రోత్సహించిందని అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారో బయటికి తీస్తే.. అన్నీ తెలుస్తాయన్నారు. దమ్ముంటే పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన ఆక్రమిత కట్టడాలను కూల్చివేయాలని సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ కు నీతి అనేది ఏమైనా ఉంటే.. తాము కట్టించిన 40 వేల డబుల్ బెడ్రూమ్ లను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పేదలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని, దీనిపై త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి చర్చిస్తామన్నారు. కేసీఆర్ పర్మిషన్ తో ఇతర కార్యక్రమాలు చేపడుతామన్నారు.
మంత్రి శ్రీధర్ పై ఫైర్
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీ మారడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరికెపూడి గాంధీకి తమ పార్టీ కండువా కప్పిన మంత్రి శ్రీధర్ అతి తెలివిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ కాదని తాము, కాంగ్రెస్ లో చేరలేదని వాళ్లు అంటుంటే.. వాళ్ల బ్రతుకు ఎటూ కాకుండా పోతుందన్నారు. గాంధీకి పార్టీ కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు, వెధవ ఎవరో మంత్రి శ్రీధర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు దమ్ము, ధైర్యం ఉంటే.. తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నట్లు అంగీకరించాలన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారని, మళ్లీ బీఆర్ఎస్ లోకే వస్తామని చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రంలో మత కల్లోలాలు లేకుండా అందరినీ సమానంగా చూశామన్న ఆయన.. చిట్టినాయుడు వల్ల తెలంగాణ అభివృద్ధి జరగదన్నారు.
హామీలన్నీ మోసం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నిహామీలు ఇచ్చిందో ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించారు కేటీఆర్. అవ్వాతాతలకు రూ.4 వేలు పింఛన్ ప్రకటించారు కానీ.. రూ.2వేలు కూడా దిక్కులేదన్నారు. రైతు రుణమాఫీ గెలిచిన మర్నాడే చేస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడు 49 వేలకోట్ల రుణాలను.. 12 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి.. చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అశోక్ నగర్ లో నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి.. తామిచ్చిన ఉద్యోగాలనే ఇచ్చి మోసం చేశారన్నారు.