టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ..? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబు పవన్ లేఖ..!

గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. TTD ఆస్తులు, భగవంతుడి ఆభరణాలకు గత ప్రభుత్వం.. రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులనే తనఖా పెట్టిన గత పాలకులు.. దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు.

 

 

టీటీడీలోని గత పాలక మండలి స్వామి వారి నిరర్థక ఆస్తులని అమ్మే ప్రయత్నం చేసిందని, తమిళనాడులో 23 ఆస్తులు, గుంటూరు, రంగారెడ్డి, హైదరాబాద్‌లో పలు ఆస్తులను అమ్మకానికి పెట్టారని పవన్ ఆరోపించారు. హిందూ సంఘాల ఆందోళనలతో అమ్మకాలు ఆగిపోయాయని డిప్యూటీ సీఎం లేఖలో ప్రస్తావించారు.

 

శతాబ్దాలుగా.. రాజులు, భక్తులు శ్రీవారికి నగలు, ఆభరాణాలు అందజేశారని శ్రీవారి ఆభరణాల లెక్కలు చూడాలని టీటీడీ అధికారులకు పవన్ సూచించారు. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా భక్తుడి నుంచి 10, 500 రూపాయలు తీసుకుని.. బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని పవన్ లేఖలో పేర్కొన్నారు.

 

 

శ్రీవాణి ట్రస్ట్ ఆదాయాన్ని మళ్లించారేమో అనే సందేహాలున్నాయని.. ట్రస్ట్‌ ద్వారా నిర్మిస్తామన్న ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు.. ఆ సంస్థ ఏమిటి ? ఎంత మేరకు శ్రీవాణి ట్రస్ట్ ఆదాయం మళ్లించారో భక్తులకు వివరాలు తెలియాలని పవన్‌ సూచించారు. టీటీడీతో పాటు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు, ఆస్తుల విషయంలోనూ సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *