అది బోనస్ కాదు.. పచ్చి బోగస్: కేటీఆర్..

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది బోనస్ కాదు.. బోగస్ అంటూ ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణి అద్భుతంగా రాణించిందన్నారు. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో సింగరేణి లాభాల్లో వాటా 20 శాతానికి మించడంలేదన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

‘మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సింగరేణిని లాభాల బాట పట్టించాం. ఆ సమయంలో రూ. 1,060 కోట్ల లాభాలు వచ్చాయి. 2014 – 15లో రూ. 102 కోట్లకు పైగా సింగరేణి కార్మికులకు బోనస్ గా ఇచ్చాం. ఆ తరువాత 2018 -19లో భారీగా లాభాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కార్మికుడికి రూ. లక్ష బోనస్ గా ఇచ్చాం. 2014లో రూ. 17 వేలు ఇస్తే, పదేళ్లలో లాభాలు పెంచి 2023 నాటికి ఒక్కో కార్మికుడికి రూ. 1.63 లక్షలు అందజేశాం. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దసరా బోనస్.. అది బోనసే కాదు.. బోగస్. దీంతో ఒక్కో కార్మికుడికి రూ. 1.80 లక్షల నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సింగరేణికి రూ. 4,701 కోట్ల లాభాలు వచ్చాయని, అందులో 33 శాతం వాటా.. అంటే రూ. 1,551 కోట్లు కార్మికులకు ఇచ్చామంటూ డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలా అయితే, ఒక్కో కార్మికుడికి రూ. 3.70 లక్షల లాభం రావాలి. కానీ, ప్రభుత్వం రూ. 1.90 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు.. అదెలా సాధ్యం. 16.2 శాతం లాభాల్లో వాటాగా ఇస్తూ 33 శాతం అంటూ ప్రభుత్వం మభ్యపెడుతుంది. సింగరేణిని లాభాల బాట పట్టించిన కార్మికులకు మీరిచ్చే బహుమతి ఇదేనా? అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అందుకు కాంగ్రెస్ చాటుగా సహకరిస్తుంది. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *