సింగరేణి కార్మికులకు భారీగా బోనస్ ప్రకటించిన సర్కారు..

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ. 4701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు రూ. 796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ. 1.90 లక్షలు బోనస్ వస్తుందన్నారు.

 

సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేగాక, ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్ గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

గత ఏడాది కంటే రూ. 20 వేలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, సింగరేణిలో మొత్తం 41,837 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు. వీరితోపాటు కాంట్రాక్ట్ వర్కర్లుగా 25వేల మంది పనిచేస్తున్నారు.

 

దసరా పండగ కంటే ముందే బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో లాభాలతోపాటు సింగరేణి వ్యవస్థ తర్వాత తరానికి ఉపయోగపడే విధంగా రామగుండంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. రామగుండంలో వెయ్యి మెగావాట్ల పవర్ ప్రాజెక్టు.. 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించి.. జైపూర్‌లో కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద. తెలంగాణ జెన్ కో తో కలిసి జాయింట్ వెంచర్ గా మరో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *