జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతాం : సీఎం రేవంత్..

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఈనెల 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆయన సంస్మరణ సభ నిర్వహించగా.. సీఎం రేవంత్ రెడ్డి హాజరై.. ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏచూరి రాసిన Caste and Class పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే అర్పించారని కొనియాడారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండుసార్లు ఆయన్ను కలిసి మాట్లాడానని, ఆయన మాటలు జైపాల్ రెడ్డిని గుర్తుచేశాయని సీఎం తెలిపారు. సీతారాం ఏచూరి జైపాల్ రెడ్డి సమకాలీకుడు అని చెప్పారు.

 

సామాన్యుడికి విద్యను అందించాలన్నా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు చేరేలా యూపీఏ ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకురావడంలో సీతారాం ఏచూరి క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అలాంటి వ్యక్తి.. బీజేపీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు, సవరణలపై తన అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా వ్యక్తం చేశారన్నారు. జమిలీ ఎన్నికల ముసుగులో బీజేపీ తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడంలో, ప్రభుత్వం విధానాలను ప్రశ్నించడంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటన్నారు. దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలన్నారు.

 

జాతీయ రాజకీయాల్లో తెలుగువారు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ శక్తుల్ని నిర్మూలించడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేసే విధంగా ఏచూరి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. ఆయనలాంటి వ్యక్తులు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరన్నారు. ఏది ఏమైనా వారు సూచించిన, పాటించిన విధానాలను ఫాలో అవుతామన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని సూచించారు.

 

రాహుల్ గాంధీ సీతారాం ఏచూరిని మార్గనిర్దేశకుడిగా భావిస్తారన్నారు. కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై వాడిన పదజాలాన్ని ప్రధాని మోదీ ఖండించకపోవడం.. బీజేపీ విధానాలేంటో చూపిస్తున్నాయన్నారు. వీధి రౌడీ అలాంటి మాటలు మాట్లాడటం వేరు అని, కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం వేరని సీఎం తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని అంత తేలికగా వదలబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *