తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్..

తిరుమల లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఈ వివాదం కొనసాగుతున్న వేళ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బోర్డు ఛైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ రద్దు చేయాలని అందులో ప్రస్తావించారు.

 

తిరుమల లడ్డూ కాంట్రవర్సీపై కొత్త లొల్లి మొదలైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఓ వైపు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎంపీ, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం నో అంటున్నారు. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించారాయన.

 

గతంలో టీటీడీ ఛైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం తనపై విజిలెన్స్ విచారణ చేస్తోందని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. వెంటనే దాన్ని రద్దు చేయాలన్నారు. తన నుంచి క్లారిటీ తీసుకోకముందే విచారణ పూర్తి చేశారని వెల్లడించారు. టీటీడీ వ్యవహారాల్లో విచారణ జరిపే అవకాశం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదన్నది వైవీ మాట.

 

టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు సొంత విజిలెన్స్ ఉందన్నారు. అందుకే రాష్ట్ర విజిలెన్స్ విచారణను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా సీఎస్, టీటీడీ ఈవో,విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, ఎస్పీలను పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.

 

మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు, ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇదే వ్యవహారంపై శనివారం ఉదయం అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. లడ్డూ కల్లీ వ్యవహారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. తిరుమల పవిత్రను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక షరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *