వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల..

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి రావాల్సిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ఎయిర్‌ పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి కోరినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించానన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిశానని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరానని తెలిపారు. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనేది తమ ప్రభుత్వం నిర్ణయంగా చెప్పారు తుమ్మల.

 

పంట ఎవరైతే పండిస్తారో వారికే చేయూత ఇవ్వాలని, అదే సరైనదని పేర్కొన్నారు. కౌలు రైతు, భూమి ఓనర్ చర్చించుకొని ఎవరికి రైతు బంధు కావాలో వారే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవన్న మంత్రి, మన భూ చట్టాలు వేరు, ఏపీలో వేరని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ చేశారని, తాము మాత్రం 42 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్టు చెప్పారు. అది కూడా 2 లక్షల రూపాయల దాకా చేశామని తెలిపారు. రైతు క్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 5 ఏళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇంకా అవసరమైన నిధులు సమకూరుస్తామని, పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ ఇస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *